Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ శివారు చందానగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. అపర్ణ అనే మహిళ, ఆమె తల్లి విజయలక్ష్మి, ఆమె నాలుగేళ్ల కుమార్తె కార్తికేయను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. రెండు రోజులుగా అపర్ణ నివాసముండే ఫ్లాట్ తాళం వేసి ఉండడం, లోపలి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన అపార్ట్ మెంట్ వాసులు కిటికీ తెరిచి చూడగా మృతదేహాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ పదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది.
చందానగర్ లోని బజాజ్ ఎలకట్రానిక్ షోరూంలో ఉద్యోగం చేస్తూ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసముంటోంది. అపర్ణ కూకట్ పల్లిలో ఉండే మధును ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వారికి నాలుగేళ్ల కూతురు ఉంది. భేదాభిప్రాయాలు రావడంతో రెండేళ్ల నుంచి అపర్ణ భర్తకు దూరంగా ఉంటోంది. మధుకి అపర్ణతో రెండో వివాహం. మొదటి పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని అపర్ట మధుపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అపర్ణ భర్త మధుపై అనుమానాలున్నాయని… ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అదే సమయంలో మధు మొదటి భార్య తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై ఆరోపణలు చేస్తున్నట్టు… అపర్ణపై మొదటిభార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు సమాచారం. ఈ కారణాలతో హత్యలు జరిగాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు ముందు అపర్ణను హత్యచేసిన దుండగులు, ఆ తర్వాత మిగతా ఇద్దరినీ చంపినట్టు అనుమానిస్తున్నారు. బలమైన గాయాలతో… అపర్ణ కిచెన్ లో రక్తపు మడుగులో పడిఉండగా… ఆమె తల్లి, కుమార్తె మృతదేహాలు బెడ్ రూంలో మంచంపై నిద్రపోతున్న స్థితిలో ఉన్నాయి. వీరిపై విషప్రయోగం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి పదకొండున్నరకు అపర్ణ సెల్ కు చివరి కాల్ వచ్చిందని,… అదే రోజు రాత్రి హత్య జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య కేసు చేధించేందుకు మూడు క్లూస్ టీంలు ఏర్పాటుచేశారు. అపర్ణ భర్త మధు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, ఈ హత్యలకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారం.