ముగ్గురు రైతుల మృత్యువాత

ముగ్గురు రైతుల మృత్యువాత

పంటలను సంతలో అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఈరోడ్‌ జిల్లా అందియూరులోని రథం వీధిలో ప్రతి సోమవారం సంత జరుగుతుంది. రైతులు పంటలను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ క్రమంలో బర్గూర్‌ అటవీ గ్రామ రైతులు ఏడుగురు ఆదివారం రాత్రి అందియూరు చేరుకున్నారు. ఓ ఎలక్ట్రిక్‌ దుకాణం వద్ద నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆ భవనం కూలింది. స్థానికులు ఆందోళనతో పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

చీకటి కావడంతో శిథిలాలు మీద పడటంతో మృతదేహాలను వెలికి తీయడం కష్టతరమైంది. ప్రొక్లయినర్‌ వాహనాలను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బర్గూర్‌ తట్టకలైకు చెందిన సిద్ధన్‌(51), చిన్న సొంగాలల్తైకు చెందిన మామహాదేవన్‌ (48), చిన్న పయ్యన్‌ (27) మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన రాజేష్‌(30), శివమూర్తి (45), మహేంద్రన్‌ (17)తో పాటు మరొకరిని అందిరయూరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఈరోడ్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.