రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఔటర్‌ డివైడర్‌ను కారు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుల్లో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ సతీమణితో పాటు సమీప బంధువులు ఉన్నారు.

సైబర్‌ క్రైమ్‌ విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసుగా పని చేస్తున్న కార్యంపూడి వెంకట మురళీధర్‌ ప్రసాద్‌ తన కుటుంబంతో మూసాపేటలో నివాసముంటున్నారు. ఈయన భార్య శంకరమ్మ ప్రభుత్వ టీచర్‌. శంకరమ్మతో పాటు ప్రసాద్‌ అన్న కుమారుడు కార్యంపూడి బాలకృష్ణమూర్తి , ఈయన భార్య రేణుక, కుమారుడు భాస్కర్‌లు ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వీరితో పాటు బాలకృష్ణమూర్తి సోదరుడు కూడా వీరితో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు.

చీరాల నుంచి పెద్ద అంబర్‌పేట వరకు ఈ వాహనాన్ని భాస్కర్‌ డ్రైవ్‌ చేశారు. అక్కడ ఎల్బీనగర్‌ వైపు వెళ్లాల్సి ఉండటంతో బాలకృష్ణ మూర్తి సోదరుడు దిగిపోయారు. ఆ తరువాత బాలకృష్ణమూర్తి డ్రైవింగ్‌ సీటులోకి వచ్చారు. ముందు సీట్లో భాస్కర్, వెనుక సీటులో శంకరమ్మ, రేణుక కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ వాహనం కీసర ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ దాటి యాద్గార్‌పల్లి వరకు వెళ్లింది.

అక్కడ ఎదురుగా వెళ్తున్న లారీ మరో లైన్‌ నుంచి వీరు ప్రయాణిస్తున్న లైన్‌లోకి వచ్చింది. గమనించిన బాలకృష్ణమూర్తి ప్రమాదాన్ని తప్పించుకోవడానికి కుడి వైపునకు తిప్పారు. కారు వేగంగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొంది. ఈ ప్రభావంతో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. వెనుక సీట్లలో కూర్చున్న శంకరమ్మ, రేణుకలు పైకి ఎగిరడంతో వారి తలలకు కారు టాప్‌ బలంగా తగిలింది.ఈ దుర్ఘటనలో వారిద్దరూ కారులోనే ప్రాణాలు వదిలారు.

డ్రైవింగ్‌ చేస్తున్న బాలకృష్ణమూర్తి సీట్‌ బెల్ట్‌ పెట్టుకున్నప్పటికీ స్టీరింగ్‌ బలంగా ముఖానికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సీట్‌ బెల్ట్‌ పెట్టుకున్న భాస్కర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మూసాపేట ఆంజనేయనగర్‌లో కేవీఎం ప్రసాద్‌ నివాసానికి తరలించారు. అక్కడకు వచ్చిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్, అదనపు సీపీ షికా గోయల్, సంయుక్త సీపీ అవినాష్‌ మహంతి నివాళుల్పించారు.