భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ 2 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. డంపర్ వాహనం ప్రమాదవశాత్తూ బొలెరోపైకి ఎక్కడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇద్దరు ఉద్యోగులు సహా ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు తీసేందుకు నూట పది టన్నుల సామర్థ్యమున్న డంపర్ తిరుగుతూ ఉంటుందని.. బొగ్గును లారీలోకి లోడ్ చేస్తుందని చెబుతున్నారు. అత్యవసరాల కోసం బొలెరో కూడా తిరుగుతుంటుందని.. బొలెరో వచ్చిన అదే సమయంలో డంపర్ రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బొలెరో పైకి డంపర్ ఎక్కడంతో నుజ్జునుజ్జైంది. ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులు సహా బొలెరో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్ల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి రెండు మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను మణుగూరుకి చెందిన పాషా, సాగర్, డ్రైవర్ వెంకన్నగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.