ఆగి ఉన్న ఆటోపై పడ్డ లారీలూ

ఆగి ఉన్న ఆటోపై పడ్డ లారీలూ

అరగంటలో తాము వెళ్తున్న ఫంక్షన్‌ హాల్‌కు చేరుకునేవారు. అంతలోనే మృత్యురూపంలో బూడిద లారీ అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొగ్గు లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న ఆటోపై పడింది. ఈ సంఘటనలో ఆటోలో వెనకవైపు కూర్చున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ చిన్నారి మృత్యువు నుంచి కొద్దిలో బయటపడింది. సంతోషంగా వెళ్తున్న వారి కుటుంబంలో ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది.

రామగుండం మండలం ముబారక్‌నగర్‌కు చెందిన షేక్‌హుస్సేన్‌ కుటుంబం మంచిర్యాల జిల్లా ఇందారంలో జరుగుతున్న ఓ శుభకార్యం నిమిత్తం అదే ప్రాంతం ఖాదర్‌కాలనీకి చెందిన రహీంబేగ్‌ ఆటోను కిరాయి మాట్లాడుకున్నారు. ఆటోలో షేక్‌ హుస్సేన్‌తోపాటు ఆయన పెద్ద కుమారుడు షేక్‌ షకీల్, మరో కుమారుడు తాజ్‌బాబా, పెద్ద కుమారుడి భార్య షేక్‌ రేష్మ, మనుమడు షేక్‌ షాకీర్, మనుమరాళ్లు షేక్‌ సాధియా, షేక్‌ సాదియా ఉమేరా కలిసి రాత్రి సమయంలో బయల్దేరారు. గోదావరిఖని గంగానగర్‌ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌ వద్దకు చేరగానే.. బొగ్గు లోడ్‌తో ఓ లారీ రోడ్డు దాటుతోంది. ఆ లారీని గమనించిన ఆటోడ్రైవర్‌ రహీంబేగ్‌ ఆటోను పక్కకు నిలిపి ఉంచాడు. అదే సమయంలో ఫ్‌లైఓవర్‌ పైనుంచి అతివేగంగా వచ్చిన బూడిద లారీ బొగ్గులారీని ఢీకొట్టింది.

వేగంగా ఉండడంతో రెండు లారీలూ పడిపోయాయి. బూడిద లారీ ఆగి ఉన్న ఆటోపై పడడంతో అందులో కూర్చున్న షకీల్‌, ఆయన భార్య రేష్మ, కూతురు షాదీ ఉమేరా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. అప్పటికే షకీల్, రేష్మ, సాదీ ఉమేరా మృతి చెందారు. ఆటోడ్రైవర్, మృతుడి తండ్రి, సోదరుడు, పెద్దకుమారుడు, పెద్దకూతురు స్వల్వ గాయాలతో బయటపడ్డారు. బూడిద లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతదేహాలను గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన షేక్‌ షకిల్‌ వెల్డర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.