ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో ఉరేసుకొని మృతి చెందడం కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. నేత కార్మిక కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి కుమారుడు ఇంట్లో బలవన్మరణం చెందడం మిస్టరీగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన నేత కార్మికుడు బైరి శంకరయ్య సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య జమున వ్యవసాయ కూలి. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వారి సంతానం. పెద్ద కుమార్తె అనితకు ఇదివరకే వివాహం కాగా భర్తతో కలసి విదేశాల్లో ఉంటోంది. చిన్న కుమార్తె అఖిలకు మూడు నెలల క్రితం పెళ్లి చేశారు.
కుమారుడు శ్రీధర్ బీటెక్ చదివాడు. అతను హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుండగా, గతేడాది కరోనా కాలం నుంచి వర్క్‌ఫ్రమ్ హోంలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ, ఆదివారం రాత్రి సమయంలో భార్యాభర్తలు, కుమారుడు ఏక కాలంలో ఇంట్లో దూలాలకు ఉరేసుకున్నారు. కరీంనగర్‌లో ఉంటున్న చిన్న కూతురు సోమవారం ఉదయం తండ్రికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దాంతో ఇంటి పక్కవారికి ఫోన్ చేసి వాకబు చేయగా, వారు వచ్చి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. అదే సమయంలో ఇంట్లో నుంచి ఫోన్ రింగ్ అయిన శబ్దం రావడంతో కూతురుకు అదే విషయం తెలిపారు.
అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో పోలీసులు ఇంటి తలుపులు తొలగించి చూడగా, ముగ్గురూ దూలాలకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తన వివాహ సమయంలో అప్పులు కావడంతో ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని చిన్న కూతురు అఖిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.