ఓండ్రుజోల గుండె పగిలింది. ఊరంతా ఒక్కటై ఏకధారగా ఏడ్చింది. లోకం తెలీని చిన్నారులను ప్రకృతి బలి తీసుకోవడంతో గ్రామం దుఃఖమయమైంది. గ్రామంలో సోమవారం సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్న అన్నాచెల్లెళ్లపై పిడుగు పడగా.. కొర్రాయి శర్వాన్(11) అనే బాలు డు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లి రూపాశ్రీ స్వల్ప గాయాలతో బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొర్రాయి ఈశ్వరరావు అరుణకుమారి దంపతుల పిల్లలు శర్వాన్, రూపాశ్రీలు రోజూలాగానే సోమవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలోనే వాన మొదలైంది. వారు బయటకు వెళ్లిన కాసేపటికే పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఈ ధాటికి శర్వాన్(11) మృతి చెందాడు. రూపాశ్రీ కూడా స్పృహ కోల్పోయి పక్కనే చెత్త కాలుస్తున్న అగ్గిమంటలో పడటంతోపలు చోట్ల గాయాలయ్యాయి.
కుటుంబ సభ్యులు హుటాహుటిన పిల్లలను కొత్తూరు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే శర్వాన్ చనిపోయాడని డ్యూటీ అధికారి ప్రశాంత్ తెలిపారు. చిన్నారి రూపాశ్రీకి సీహెచ్‌సీలో వైద్యం అందించారు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిరించారు. వారి రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ సంఘటనతో ఓండ్రుజోలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఈశ్వరరావు రైల్వేలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.