హల్‌చల్‌ సృష్టించిన పెద్దపులి

హల్‌చల్‌ సృష్టించిన పెద్దపులి

కుమురం భీం జిల్లాలో పులుల సంచారం అధికమవుతోంది. బుధవారం ఓ పెద్దపులి హల్‌చల్‌ సృష్టించింది. ఒకే రోజు మూడు చోట్ల సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇందులో బెజ్జూర్‌ మండలం ఏటిగూడ వద్ద రోడ్డుపై ఉన్న ప్రయాణికులను వెంటాడింది. బెజ్జూర్‌ మండలం నందిగామ్‌కు చెందిన కేశయ్య, బానయ్య బుధవారం మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఏటిగూడ పరిసర ప్రాంతం మాణికదేవర అటవీ ప్రాంతంలో వీరికి పెద్దపులి ఎదురుపడింది. దీంతో వారు వాహనాన్ని వదిలి పరుగులు తీశారు. కొద్ది దూరం వెంటాడటంతో తప్పించుకుని సమీపంలోని చెట్టు ఎక్కి ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో బెజ్జూర్‌ రేంజ్‌ అధికారి దయాకర్‌ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి కదలికలను గుర్తించి అది వెళ్లిన మార్గాన్ని తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కమ్మర్‌గాం నుంచి చింతలమానెపల్లి మండల కేంద్రానికి వెళ్తున్న ఇద్దరు యువకులకు పులి కనిపించింది. దీంతో పాటు బుధవారం సాయంత్రం బెజ్జూర్‌ మండలం గబ్బాయి గ్రామ సమీపంలో మేత మేస్తున్న ఆవుపై పులి దాడి చేసి చంపేసిందని బీట్‌ అధికారి అనిత తెలిపారు. వారం రోజుల క్రితం దహెగాం మండలం దిగిడలో ఓ యువకుడిపై పులి దాడి చేసి హతమార్చింది. ప్రస్తుతం ఇలా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులిని బంధించేందుకు దిగిడ అడవుల్లో పది బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎనిమిది పులుల వరకూ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.