చలో అసెంబ్లీ…అమరావతిలో మునుపెన్నడూ లేనంత భద్రత…!

Tight Security At AP Assembly In Amaravathi

కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అమరావతిలోని అసెంబ్లీ, కృష్ణానది కరకట్ట, మంగళగిరి రహదారి, జాతీయ రహదారిపై ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ప్రకాశం బ్యారేజీ, కరకట్ట వారధి, మందడం తదితర ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు, ఆ మార్గాల్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టూ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి, ఆందోళనకారులు లోనికి చొరబడకుండా పటిష్ట కాపలా ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లోని పలువురు ఉపాధ్యాయులను ఇప్పటికే బైండోవర్ చేసి వారిని గృహనిర్బంధం చేశారు.

police

కానీ పోలీసుల కళ్లుగప్పి ఉండవల్లి, సీతానగరం చేరుకున్న ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని తాడేపల్లి, మంగళగిరి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రహస్యంగా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సుమారు 400 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సాయంత్రం నుంచే ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ వారి సొంత మండలాల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇక విజయనగరం జిల్లా నుంచి అమరావతికి వెళ్లోన్న యూటీఎఫ్ సభ్యులను విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. రైల్లో ప్రయాణిస్తున్నవారిని కంచరపాలెం ఎస్ఐ వెంబడించి మరీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అర్టీసీ సైతం అమరావతికి బస్సులను రద్దుచేసింది. అలాగే అసెంబ్లీలో ఈరోజు దాదాపు పది బిల్లులను పాస్ చేయనున్నారు.

ap-security