జూలై 16న తిరుమల ఆలయం మూసివేత

Tirumala temple closed on july 16

2019లో ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనుండగా వీటిలో రెండు సంపూర్ణ సూర్య గ్రహణాలు, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. కొత్త ఏడాది ప్రారంభమైన తొలివారంలోనే సూర్యగ్రహణం సంభవించింది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడింది. జనవరి 6 పాక్షిక సూర్యగ్రహం, జనవరి 21న సంపూర్ణ చంద్రగహణం ఏర్పడ్డాయి. ఇది ఆసియా, ఫసిఫిక్ తీరం, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో కనిపించింది. ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం జులై 16 అర్ధరాత్రి దాటిన తర్వాత 1.31 గంటలకు సంభవించనుంది. ఇది తెల్లవారుజాము 4.29 గంటల వరకు ఉంటుంది. దీంతో తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని జులై 16న రాత్రి 7 నుంచి మర్నాడు అంటే 17 తెల్లవారుజామున 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించి, ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని కోరింది. జులై 17 బుధ‌వారం ఉద‌యాత్పూర్వం 1.31 నుంచి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు ఆలయం మూసివేయడం ఆనవాయితీ. జులై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.