ఎన్డీ తివారీ కొడుకును చంపింది కోడలే…వివాహేతర సంబంధం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ తివారి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రోహిత్ భార్య అపూర్వ శుక్లానే నిందితురాలిగా అనుమానిస్తోన్న పోలీసులు, ఆమెను ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. రోహిత్‌ మరణం తొలుత సహజమరణంగానే భావించినా, పోస్ట్‌మార్టం నివేదికలో హత్యగా తేలింది. దీంతో హత్య కేసు నమోదుచేసిన పోలీసులు, దీనిని క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. రంగంలోకి దిగిన క్రైం బ్రాంచ్ విచారణ వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా అపూర్వను మూడు రోజుల పాటు వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు, చివరకు ఆమే ఈ హత్యకు పాల్పడినట్టు నిర్ధరణకు వచ్చారు. రోహిత్ తల్లి ఉజ్వల సైతం, తన కుమారుడు, అపూర్వల వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగడంలేదని, రోజూ గొడవలు పడుతూ ఉండేవారని పోలీసులకు చెప్పడంతో ఆ కోణం ప్రశ్నించారు. చివరకు ఆమె అసలు నిజం అంగీకరించినట్టు భోగట్టా. మద్యం మత్తులో ఉన్న రోహిత్‌ ముఖంపై తానే దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్యచేశానని చెప్పినట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌కు వెళ్లిన రోహిత్ ఏప్రిల్ 15 అంటే చనిపోయే ముందు రోజు ఢిల్లీకి వచ్చారు. అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికొచ్చినట్టు ఆయన నివాసం వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించారు. అయితే దీనికి వివాహేతర సంబంధం కారణం అని పోలీసులు తొలుత భావించినా ఇప్పుడు మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.