తెలంగాణా కూటమి కలిసే ఉందట…!

TJS Chief Prof Kodandaram Comments On Mahakutami Defeat In Telangana Elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప్ర‌జా కూట‌మి రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా కొన‌సాగుతుందా అనే చ‌ర్చ గ‌త కొద్దిరోజులుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మి వైఫ‌ల్యాల‌పై ఇప్ప‌టికీ స‌రైన చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ఓట‌మి కార‌ణాల‌పై కాంగ్రెస్ పార్టీ కొన్ని నివేదిక‌లు త‌యారు చేసి, హైక‌మాండ్ కి పంపించింది. అయితే, టీడీపీతో పొత్తు కూట‌మికి కొంత ఇబ్బంది క‌లిగింద‌నేది కొంత‌మంది కాంగ్రెస్ నేత‌ల అభిప్రాయంగా ఉన్నా ఇత‌ర కార‌ణాలే ఎక్కువ ప్ర‌భావితం చేసేశాయ‌నే ఆ రిపోర్టులలో పంపారట. అందుకే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఇదే కూట‌మిని కొన‌సాగించినా త‌ప్పులేదు అనే అభిప్రాయం పీసీసీ వ‌ర్గాల్లో ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఇక ప్ర‌జా కూట‌మిలో మరో పార్టీ అధినేత కోదండ రాం కూటమి ఓట‌మిపై తాజాగా స్పందిస్తూ అభ్య‌ర్థుల ఎంపిక త్వ‌ర‌గా చేయ‌క‌పోవ‌డం, ప్ర‌చారానికి స‌రైన స‌మ‌యం లేకపోవ‌డం, ప్ర‌చార వ్యూహాన్ని ప‌క్కాగా త‌యారు చేసుకోక‌పోవ‌డం లాంటివే కార‌ణాలుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఆయన మాటలు వింటుంటే లోక్ స‌భ ఎన్నిక‌లలో ప్ర‌జా కూట‌మి కొన‌సాగుతుంద‌న్న‌ట్టుగానే అనిపించాయి. తెరాసపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ, దాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలోనే కూట‌మి ఫెయిల్ అయింద‌నేది ఆయ‌న విశ్లేష‌ణ‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను పునరావృతం కాకుండా చూసుకోవాల‌నేది ఆయ‌న సూచ‌న‌. ఇక‌, టీడీపీ నుంచి కూడా ప్ర‌జా కూట‌మి నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్టుగా కూడా సంకేతాల్లేవు. ఆ పార్టీ అధినేత బాబు అయితే జాతీయ స్థాయిలో భాజ‌పాయేత‌ర ప‌క్షాల‌ను ఏకం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ కూడా ప్ర‌జా కూట‌మి కొన‌సాగింపున‌కే మొగ్గు చూపుతోంది. భాజ‌పాకి వ్య‌తిరేకంగా దేశంలో ఏ పార్టీ త‌మ వెంట వ‌చ్చినా క‌లుపుకుని లోక్ స‌భ ఎన్నిక‌లను ఎదుర్కోవాల‌ని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఏర్ప‌డి ఉన్న కూట‌మిని కాద‌నుకునే విధంగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం లేదు. దీంతో లోక్ సభ ఎన్నికలకు కూడా కూటమి కలిసే పోటీ చేస్తుందన్న మాట.