జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అక్కడేం జరుగుతోందన్న ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది. కేంద్ర బలగాల మోహరింపు సహా జరుగుతున్న పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.
ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో నేడు ఏదో జరగబోతోందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నా పోలీసులు ధ్రువీకరించలేదు.
కాగా, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. అంతేకాక ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా గతంలో తెలుగు రాష్ట్రాలకు, ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్ గా పనిచేస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ ను నియమించ వచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోమ్ శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి గవర్నర్ గా పని చేస్తున్న ఆయన, గతంలో కేంద్ర సర్వీసుల్లోనూ విధులు నిర్వహించారు. హోమ్ శాఖలోనూ పనిచేశారు. శాంతిభద్రతల అంశంపై ఆయనకు ఉన్న పట్టు కారణంగానే కాశ్మీర్ గవర్నర్ గా ఆయన పేరును ఖరారు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపేట్టుగా చేసిందని తెలుస్తోంది.