గూగుల్ కు ఈరోజు ఎంతో ప్రత్యేకం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ నేడు తన 21వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్ సంస్థ ఓ ప్రత్యేక డూడుల్‌ను తయారుచేసింది.‘గూగుల్’ అనే పదంతో నేడు ఎవరికీ రోజు గడవని స్థితి. చరిత్ర నుంచి నేటి తరం వరకూ వారధిలా ఉంటూ సుదూర భవిష్యత్ కు బాటలు వేస్తోంది.
తొలితరం బాక్స్ కంప్యూటర్ మానిటర్ పై గూగుల్ సెర్చ్ ఇంజిన్ పేజీని చూపుతూ ఈ డూడుల్ ను తయారు చేసింది సంస్థ. దానిపై 27’ 9 1998 తేదీని చూపిస్తూ టైమ్ స్టాంప్ కనిపించేలా ముద్రించింది. 21ఏళ్ల క్రితం గూగుల్ డూడుల్ ఎలా ఉండేదో అదే డూడుల్ ను గూగుల్ పేజిలో ఉంచింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ కలిసి 1998 సెప్టెంబర్ లో ఈ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించారు. ఈ విద్యార్ధులిద్దరూ కలిసి దీనికి గూగుల్ అనే అర్థం వచ్చేలా ఈ సెర్చ్ ఇంజిన్‌కు పేరు పెట్టారు. గూగుల్ అంటే చాలా పెద్ద సంఖ్య అని అర్ధం. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్యను గూగుల్ అంటారు. ఎంతో విస్తృతమైన సమచారం ఈ సెర్చ్ ఇంజిన్‌లో లభ్యమవుతుందని చెప్పేందుకు ఈ పేరు పెట్టారు.
నిజానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ బ్యాక్ రబ్ గా మొదలయింది. స్క్రీన్ పై అరచేయి సింబల్ కూడా ఉండేది. కానీ తర్వాత దీని పేరును Google గా మార్చారు.