రామాలయానికి భూమి పూజ జరిగిన ఆగస్టు 5 ను చారిత్రకరోజుగా యోగా గురువు బాబా రాందేవ్ అభివర్ణించారు. తరతరాలు ఈ రోజును గర్వంగా గుర్తుంచుకుంటాయని అన్నారు. భారత్లో కొత్త చరిత్ర లిఖించబడిందని, ప్రజలందరూ ఈరోజును పరస్కరించుకొని సంబరాలు జరుపుకోవాలన్నారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన సందర్భంగా బాబా రాందేవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆలయ నిర్మాణంతో దేశంలో రాజరాజ్యానికి నాంది పలికినట్లయ్యిందన్నారు. ఈ చారిత్రక ఘట్టంతో సాంస్కృతిక, ఆర్థిక అసమానతలు తొలిగిపోతాయని రామరాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారన్నారు. రామ రాజ్యం అంటే ఆదర్శవంతమైన పరిపాలన అని రాందేవ్ అన్నారు.
రాముడికి, హనుమంతుడికి నరేంద్రమోదీ అపర భక్తుడని, అలాంటి ప్రధాని మనకుండటం ప్రజలందరి అదృష్టమని అన్నారు. హిందూ ధర్మం గర్వించేలా చేసిన ప్రధాని మోదీనే అని బాబా రాందేవ్ కొనియాడారు. అత్యంత భద్రత , కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 175 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయెధ్య రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్య నగరమంతా రామనామంతో మార్మోమోగిపోతుంది.