41వ పుట్టినరోజు జరుపుకుంటున్న ‘చంద్రముఖి’

41వ పుట్టినరోజు జరుపుకుంటున్న ‘చంద్రముఖి'

ఈరోజు జ్యోతిక 41వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితం, సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.జ్యోతికను చూసి అంతా తమిళ పొన్ను అనుకుంటారు. కానీ ఆమె పుట్టింది ముంబయిలో. 1998లో బాలీవుడ్‌లో వచ్చిన ‘డోలీ సజా కే రఖ్‌నా’ అనే చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. కానీ ఈ సినిమా జ్యోతికకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత నుంచి ఆమె తమిళ సినీ ప్రస్థానం ప్రారంభించింది. 1999లో వచ్చిన ‘వాలి’ చిత్రంలో నటించింది. ఈ సినిమాకు గానూ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. అక్కడి నుంచి జ్యోతికకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వరుసగా తమిళ చిత్ర సీమను ఏలేశారు. జ్యోతికను చూసి మన తెలుగు దర్శక, నిర్మాతలు కూడా ఫిదా అయ్యారు.

అందుకే 2003లో వచ్చిన ‘ఠాగూర్’ సినిమాలో తొలి అవకాశంలోనే మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మాస్’, ‘షాక్’ చిత్రాల్లో నటించింది. జ్యోతిక నటించింది మూడు తెలుగు సినిమాల్లోనే అయినా ఆమె ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. అందుకే ఆమె నటించే ప్రతీ తమిళ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తూ వచ్చారు. చీరకట్టుతో ఎంతో పద్ధతిగా కనిపించే జ్యోతిక 2018లో వచ్చిన ‘రాక్షసి’ సినిమాతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇక జ్యోతిక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ప్రముఖ తమిళ నటుడు సూర్యను జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 సెప్టెంబర్ 11న వీరి వివాహం జరిగింది. వీరిద్దరూ జంటగా ఏడు సినిమాల్లో నటించారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం జ్యోతిక తొలిసారి తన మరిదితో కార్తితో కలిసి పనిచేయబోతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. దీంతో పాటు ‘పోన్ మగళ్ వందళ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు.. సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత చేయబోయే సినిమాలో జ్యోతిక కథానాయికగా నటించనున్నారట.