టాలీవుడ్‌ ప్రముఖ నటుడు కన్నుమూత

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు కన్నుమూత

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూశారు. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో కుప్పకూలిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు జయప్రకాశ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కొరిటెపాడు శ్మశానవాటికలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టి… రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, రేసుగుర్రం, మనం, టెంపర్‌, సరైనోడు తదితర సినిమాల్లో నటించారు.

సీనియర్‌ కథానాయకులతో పాటు యువ హీరోలతోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుని తనదైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అలరించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాశ్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ ‘అలెగ్జాండర్’(ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్‌) పేరుతో ఇటీవల ఓ సినిమాను కూడా నిర్మించారు. జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని నివాళులు అర్పిస్తున్నారు.