అమరావతి మన అమరావతి కాదండోయ్ మహారాష్ట్రలోని కీలక నియోజకవర్గం. అక్కడ శివసేన అభ్యర్థి నుంచి ఆనంద్‌రావు ఐదుసార్లు గెలిచారు. అలాంటి చోట ఒకట్ప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు గెలిచి హాట్ టాపిక్ గా మారారు. తెలుగులో హిట్టయిన శీను వాసంతి లక్ష్మి చిత్రంలో అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన నవనీత్ కౌర్ చాన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలో అడుగుపెట్టింది. అప్పట్లో ఆమె మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకుంది.
ఇప్పుడు నవనీత్ కౌర్ కూడా భర్త అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాదు, ఏకంగా ఎంపీ అయింది. లోక్ సభ ఎన్నికల్లో ఆమె మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి శివసేన పార్టీ అభ్యర్థిపై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
ఆమె భర్త రవి రాణా ఎవరో కాదు, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు మేనల్లుడు. 2011లో రవి రాణా, నవనీత్ కౌర్ జోడీ, 3100 ఇతర జంటలతో కలిసి సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటైంది. ఆయన మొదటి నుంచి యువ స్వాభిమాన్ పార్టీ తరఫున పని చేస్తున్నారు. నవనీత్ కౌర్ కూడా అదే పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఆమెకు 5 లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి.