ఇండియాలో కరోనా విజృంభిస్తూ వుంటే, విదేశాల్లో దాని బెడద తగ్గుతోంది. ఇండియాలో పరిస్థితులు నార్మల్ అవడానికి మరిన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతవరకు షూటింగ్స్ ఆపుకుని కూర్చోవడం కంటే లొకేషన్ మార్చేస్తే ఎలా వుంటుందనే ఆలోచనలో అగ్ర హీరోలు వున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాన్ని మొదట్లో విదేశీ అడవులలో చిత్రీకరించాలని భావించారు. కానీ కరోనా కారణంగా ఇండియాలో చేసేయాలని ఫిక్సయ్యారు. ఇప్పుడు పరిస్థితి తారుమారు అవడంతో విదేశాల్లోనే షూటింగ్ ప్లాన్ చేసుకుంటే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ షూటింగ్స్ కి కూడా చాలా నిబంధనలున్నాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో వుంచుకుని అక్కడకు వెళ్లాల్సి వుంటుంది.
మహేష్‍బాబు ‘సర్కారు వారి పాట’ కూడా విదేశాల్లోనే ప్లాన్ చేస్తే ఎలాగుంటుందని ఆ చిత్ర రూపకర్తలు ఆలోచన చేస్తున్నారట. అయితే కథాప్రకారం ఈ చిత్రానికి ఇండియా బ్యాక్‍డ్రాప్ తప్పనిసరి. కనుక బ్యాక్‍డ్రాప్‍తో పని లేకుండా ఎక్కడయినా షూట్ చేసుకునే వీలున్న భాగాల వరకు అయినా చేసే అవకాశముందేమో తరచి చూస్తున్నారట. ఇవి కాక మరికొన్ని చిత్రాల యూనిట్స్ కూడా విదేశీ యానం గురించి సమాలోచనలు జరుపుతోన్నట్టు సమాచారం.