భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో… అందరూ తప్పక తెలుసుకోవాల్సిన ఆ వివరాలను మీ ముంచు ఉంచుతున్నాం.
అబద్ధం : ఆర్టికల్ 370 నెహ్రూ-షేక్ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం.
వాస్తవం : ఆర్టికల్ 370 రాజ్యాంగం రచనా కాలంలోనే దానిలో పొందుపర్చబడి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి, అంటే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.
అబద్ధం : భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఈ ఆర్టికల్ జమ్మూ-కాశ్మీర్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌లో, భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు.
వాస్తవం : రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతానికి లేక రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది ఒక జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికే పరిమితం కాదు. అలాంటి సదుపాయా లు ఆర్టికల్ 371 ద్వారా అనేక రాష్ట్రాలకు కల్పించారు. ఈ ఆర్టికల్ ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడాల్లోను, గుజరాత్ లోని కచ్ ప్రాంతంలోను ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ఆ ప్రాంతాలలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన వాటా ఇచ్చే ప్రత్యేక అధికారాలు వుంటాయి. అలాగే 371-బి అస్సాంకు, 371-సి మణిపూర్ కు, 371-ఎఫ్ సిక్కింకు, 371-హెచ్ అరుణాచల్ ప్రదేశ్‌కు, 371-ఐ గోవాకు ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది.
ఇక స్థలాల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఆర్టికల్ 370 జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయం కల్పించినట్లే, ఆర్టికల్ 371-ఎ నాగాలాండ్‌కు, 371-జి మిజోరాంకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఆర్టికల్ 371ఎ, ఆర్టికల్ 371-జి ప్రకారం నాగాలాండ్, మిజోరాం లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందని వారు అక్కడి భూములు కొనగూడదు. అమ్మకూడదు.ఈ విషయాలలో భారత పార్లమెంటు చేసే చట్టాలు కూడా ఆ రాష్ట్రాలకు వర్తించవు.
అంతెందుకు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా 1/70 చట్టం అమలులో వుంది. ఆ చట్టం ప్రకారం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలుగా ప్రకటించబడ్డ ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే భూములు కొనాలి. అమ్మాలి. గిరిజనేతర ప్రజలు, వారు భారతీయులైనా సరే ఆ ప్రాంతాలలో భూములు కొనరాదు. అమ్మరాదు. ఇలా 370, 371-ఎ, 371-జి, 1/70 చట్టాలను రాజ్యాంగం లో ఎందుకు పొందుపరచారు? ఎందుకు అమలు చేస్తున్నారు? ఎందుకంటే ఆయా ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడి వున్నాయి.
అక్కడ కొనుగోళ్లకు భారతీయుల లోనే వేరే ప్రాంతాల వారికి అవకాశమిస్తే, వెనుకబడిన ఆయా ప్రాంతాల వాళ్లను వేరే ప్రాంతాల వాళ్లు మోసం చేస్తారనే సందేహంతో, ఆ ప్రాంతాల వారి ఆస్తులకు ప్రత్యేక రక్షణ నిమిత్తం రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్‌లు, కొన్ని ప్రత్యేక చట్టాలు చేశారు. వాస్తవం ఇది కాగా, ఆర్టికల్ 370 ఒకటే ప్రమాదకరమనీ, దానిని ఎత్తివేయాలనీ ప్రచారం చేయడం వాస్తవాన్ని వక్రీకరించడమే.
అబద్ధం : ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ-కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాధి కారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా, ఎటువంటి నేరమూ కాదు.
వాస్తవం : ఇది శుద్ధ అబద్ధం. ఆర్టికల్ 370 లో అలాంటి అంశమే పేర్కొనలేదు. అలాంటి అంశం ఉందని చెప్పడం స్వాతంత్య్ర సమర యోధులైన రాజ్యాంగ నిర్మాతలందరినీ అవమానించడమే. స్వాతంత్య్ర పోరాట వీరులైన రాజ్యాంగ నిర్మాతలు తమ జాతీయ పతాకాన్ని అవమానిస్తే నేరం కాదని రాజ్యాంగం లోని ఒక ఆర్టికల్‌లో రాశారని ప్రచారం చేయడం అబద్ధాలకు పరాకాష్ట!
అబద్ధం : సుప్రీం కోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పని చేయవు.
వాస్తవం : ఇదో పెద్ద అబద్ధం. ఉదాహరణకు 2016లో ‘జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం ఆర్టికల్ 370 కారణంగా సర్వసత్తాక అధికారాలు కలిగిన రాష్ట్రం’ అని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంటే దానిని 2016 డిసెంబరులో సుప్రీం కోర్టు కొట్టివేసింది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం సర్వసత్తాక దేశమైన ఇండియాలో ఒక భాగమని పేర్కొన్నది. ఆ తీర్పును జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర హైకోర్టు గానీ, ప్రభుత్వం గానీ వ్యతిరేకించలేదు. సుప్రీం కోర్టు తీర్పులే కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఈ రాష్ట్రంలో వర్తిస్తున్నాయి. ఉదాహరణకు 11-2-56, 19-2-94ల మధ్య జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి 47 ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.
అబద్ధం : జమ్మూ-కాశ్మీర్‌లో ఉండే కాశ్మీర్ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవు తుంది. అదే, పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసు కుంటే మాత్రం, పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది.
వాస్తవం : ఈ ప్రచారం కూడా అబద్ధమే. ఇలాంటి అంశమేదీ ఆర్టికల్ -370లో లేదు. కాకపోతే రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డరు ప్రకారం 35-ఎ ఆర్టికల్ అమలులోకి వచ్చింది. దానికి అనుగుణంగా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం ఆ రాష్ట్రంలోని పురుషుడు వేరే రాష్ట్ర యువతిని పెళ్లి చేసుకుంటే, వారి సంతానానికి వారసత్వ హక్కులు లభిస్తాయి. అదే కాశ్మీర్ యువతి వేరే రాష్ట్రానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే, వారి సంతనానికి ఆ రాష్ట్ర పౌర హక్కులు, వారసత్వ హక్కులూ లభించవు. అంతేకాని, పాకిస్తాన్ పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమె భర్తకు కాశ్మీర్ పౌరహక్కులు లభిస్తాయనడం పూర్తిగా తప్పుడు ప్రచారం.
అబద్ధం : కాశ్మీర్‌లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు) రాజ్యాంగ బద్ధంగా రావలసిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
వాస్తవం : ఇది కూడా అబద్ధ ప్రచారమే. రాజ్యాంగం భారత దేశం మొత్తంలోను కొందరిని మైనారిటీలుగా నిర్ణయించింది. వారు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు). అంతేకాని, ప్రతి రాష్ట్రానికీ వేరు వేరుగా మైనారిటీలు నిర్ణయించబడలేదు. పంజాబ్‌లో సిక్కులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీ. నాగాలాండ్, మిజోరాం, లక్షద్వీప్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లో క్రైస్తవులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీగా ఉంటున్నారు. కాని రాజ్యాంగం దేశానికంతటికీ మాత్రమే మైనారిటీలను నిర్ణయించిన కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా పైన చెప్పిన ఆరు మతాల వారు మాత్రమే, మైనారిటీ లుగా పరిగణించబడుతున్నారు.