కరోనాతో మృతి చెందిన అనంతపురం ట్రాఫిక్‌ సీఐ

కరోనాతో మృతి చెందిన అనంతపురం ట్రాఫిక్‌ సీఐ

అనంతపురం ట్రాఫిక్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌ (47) కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు. ఈయన కొన్నేళ్లుగా మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తరువాత పరిస్థితి విషమించింది.

దీంతో ఆయనను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజశేఖర్‌ కుటుంబసభ్యులు కర్నూలులోని రామలింగేశ్వర నగర్‌ రోడ్‌నెంబర్‌ 5లో నివాసముంటున్నారు. ఆత్మకూరు మండలం కృష్ణాపురం స్వగ్రామం. తండ్రి శ్రీరాములు కో–ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు.

అప్పటి నుంచి వీరు కర్నూలులోనే నివాసముంటున్నారు. శ్రీరాములుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. రెండవ కుమారుడైన రాజశేఖర్‌ 1995లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ఎక్కువ కాలం అనంతపురం జిల్లాలోనే విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొందిన తరువాత కొంతకాలం కర్నూలు సీసీఎస్‌లో కూడా విధులు నిర్వహించారు. ఈయనకు భార్య శిరీషతో పాటు బీటెక్‌ చదువుతున్న కుమారుడు ఉన్నాడు.