నెలరోజుల పాటు లైసెన్స్ ల రద్దు

నెలరోజుల పాటు లైసెన్స్ ల రద్దు

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహన దారులందరు కూడా బెంబేలెత్తిపోతుంటే, తాజాగా మరొకసారి ట్రాఫిక్ పోలీసులు సరికొత్త బాంబ్ పేల్చారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించని వారే ఎక్కువగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని చట్టాలు చేసినప్పటికీ కూడా ఇప్పటికి హెల్మెట్ లేకుండానే చాలా మంది వాహనాలను నడుపుతున్నారు. అయితే ఈమేరకు ట్రాఫిక్ పోలీసులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా జనవరి 1వ తేదీ నుంచి హెల్మెట్‌ ధరించకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారుల పై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు.

కాగా ఎవరైనా హెల్మెట్ లేకుండా పట్టుబడితే, వారి లైసెన్స్ లను నెలరోజుల పాటు రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సస్పెన్షన్ సమయంలో ఎవరైనా మళ్ళీ వాహనాలు నడిపితే వారి వాహనాన్ని సీజ్ చేసి, వారిని జైలుకు పంపడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు – ఎస్‌.వెంకటేశ్వరరావు, డీటీసీ, మాట్లాడుతూ… ”కేంద్ర మోటార్‌ వాహన చట్టం 138(ఎఫ్‌) ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. ఎవరైనా సరే నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోని, వారి డ్రైవింగ్‌ లైసెన్సులను నెల రోజులపాటు సస్పెండ్‌ చేస్తాం. అప్పటికి కూడా వాహనం నడువుతూ పట్టుబడితే మాత్రం జైలుకు పంపిస్తామని” హెచ్చరికలు చేశారు