ప్రమాదమనీ, ప్రాణాంతకమనీ తెలిసినా ఏదో ఒక కారణంతో కొంతమంది కదిలే రైలునుంచి ప్లాట్‌ఫాం మీదికి దూకడం లాంటి చర్యల్ని మానుకోరు. ఇలాంటి దుందుడుకు చర్యతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించి ఉండకపోతే క్షణాల్లో ఆయన ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. వాయువేగంగా కదలిన గార్డు పట్టు తప్పి పట్టాలపై పడిపోబోతున్న సదరు వ్యక్తిని కాపాడారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
దిలీప్ భికాన్ మాండే (52) తన కుమారుడితో కలిసి మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ వెళ్తున్నారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ నుండి యూపీకి చెందిన కామ్యాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంది. అయితే పొరపాటున వీరిద్దరూ బిహార్‌కు చెందిన పవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేసారు.ఈ విషయాన్ని గ్రహించే సమయానికి, రైలు ప్లాట్‌ఫాం నుండి బయలుదేరుతోంది. దీంతో వారు సామానుతో పాటు కదిలే రైలు నుండి ప్లాట్‌ఫాంపై దూకేందుకు ప్రయత్నించారు.
కుమారుడు బాగానే దూకేశాడు కానీ తండ్రి సైడ్ బార్ పట్టుకుని ఉండటంతో నియంత్రణ కోల్పోయాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు క్షణం ఆలస్యం చేయకుండా మాండే ను ట్రాక్‌పైకి జారిపోకుండా కాపాడారు. దీంతో మాండే స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సోమనాథ్ మహాజన్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సిప్) అధికారి కె సాహు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తన ప్రాణాలను కాపాడినందుకు సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.