మలేషియాలో ఘోర రైలు ప్రమాదం

మలేషియాలో ఘోర రైలు ప్రమాదం

మలేషియాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని కౌలాలంపూర్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.45గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెస్ట్‌ రన్‌లో భాగంగా వెళ్తున్న ట్రైన్‌లో ఒక డ్రైవర్‌ మాత్రమే ఉండగా.. మరో రైలు ప్రయాణికులతో వస్తుంది.

ఈ క్రమంలో పెట్రోనాస్‌ టవర్స్‌కు సమీపంలో కంపంగ్‌ బారు – కేఎల్‌సీసీ స్టేషన్ల మధ్య సొరంగంలో రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 166 మందికి స్వల్పంగా, 47 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయని రవాణా శాఖ మంత్రి వీ కాసియాంగ్ పేర్కొన్నారు. క్షతగాత్రులకు గాజు ముక్కలు తగలడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. సమాచార లోపం వల్లే ఘటన జరిగిందని, గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

డాంగ్‌ వాంగి జిల్లా పోలీస్‌ చీఫ్‌ ఏసీపీ మొహమ్‌ జైనాల్‌ అబ్దుల్లా మాట్లాడుతూ ప్రయాణికులతో వెళ్తున్న రైలు కేఎల్‌సీసీ స్టేషన్‌ నుంచి పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్స్‌కు దగ్గరలో ఉన్న భూగర్భ సొరంగం లైన్‌లో గోంబాక్‌ స్టేషన్‌కు వెళ్తుందని చెప్పారు. ఘటనపై మలేషియా ప్రధాని మొహిద్దీన్ యాసిన్‌ తీవ్ర విచారం వ్యక్త చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపాలని రవాణా మంత్రిత్వశాఖకు సూచించారు. ఈ దుర్ఘటన 23 ఏళ్ల మలేషియా మెట్రోరైలు చరిత్రలో మొదటిది.