ఫేస్బుక్ సాయంతో మైనర్ బాలికకను ట్రాప్ చేసి ఆమె నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన యువకులను హైదరాబాద్ సనత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరిట బాలికను లోబరుచుకోవడమే కాకుండా.. ఆమెతో వ్యక్తిగత ఫోటోలు దొంగిలించి ఏకంగా రూ.11.5లక్షలు దోచేశారు నిందితులు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల ఆట కట్టించారు. సనత్‌నగర్‌లో నివాసముండే దంపతులు డాక్టర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఓ కుమార్తె(16) ఉంది. డబ్బులకు కొదవ లేకపోవడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో బాలిక సోషల్‌మీడియాకు బానిసైంది.
ఈ క్రలోనే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన హేమంత్ ఉద్యోగం నిమిత్తం సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. ఫేస్బుక్ ద్వారా బాలికతో స్నేహం ఏర్పరచుకున్న హేమంత్ ప్రేమపేరుతో ఆమెను ఏడాదిగా లొంగదీసుకుంటున్నాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలతో స్నేహితుడు సాయితో కలిసి ఆమెను బెదిరిస్తున్నాడు.
బాలిక నుంచి ఇప్పటివరకు రూ.11.5లక్షలు వసూలు చేశాడు. కుమార్తె ఇంట్లో నుంచి రూ.లక్షల నగదు దొంగిలించి నిందితులకు ఇస్తున్నా తల్లిదండ్రులు గుర్తించకలేకపోయారు. అయితే ఇటీవల రాజమహేంద్రవరానికి వెళ్లిన హేమంత్, బి.సాయి.. అక్కడ ఫ్రెండ్స్ రాజు, సాయి, కుమార్, నానితో కలిసి బాధితురాలికి ఫోన్ చేశారు.
రూ.40లక్షలు ఇవ్వకపోతే ఫోటోలను సోషల్‌మీడియాలో పెడతామని బాలికను బెదిరించారు. దీంతో ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌ను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న సనత్‌నగర్ పోలీసులు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.