ఆమె ఎంతో అందంగా ఉంటుంది. అంతకంటే అందంగా మాట్లాడుతుంది. అలా వాటినే ఏరా వేసి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న యువకులకు వల విసురుతుంది. మాయమాటలతో దగ్గరవుతుంది. పెళ్లి చేసుకుందామంటూ నమ్మిస్తుంది. కష్టాల కథలు చెప్పి అందినంత కాజేసి, అవసరం తీరాక మొహం చాటేస్తుంది. ఇలా ఆ కిలాడీ యువతి వలలో చిక్కుకున్న యువకులు 17 మంది. బాధిత యువకులు కొందరు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మాయలేడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తమిళనాడులోని కడలూరు జిల్లా వలయామదేవి ప్రాంతానికి చెందిన ఎంబీఏ పట్టభద్రుడైన బాలమురుగన్ (33) అనే బంగారు నగల వ్యాపారి తన వివాహం కోసం కొన్నేళ్ల క్రితం మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పేరు, వివరాలు నమోదు చేశాడు. కొన్నాళ్లకు అతనికి ఓ యువతి నుంచి కాల్ వచ్చింది. సేలం జిల్లా ఆట్టయంపట్టి దగ్గర్లో ఉన్న మరుమలయంపాలెం గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి బాలమురుగన్ కలిసి మాట్లాడింది. చూడగానే నచ్చేశావంటూ మత్తెక్కించే మాటలతో పడేసింది. త్వరగా పెళ్లి చేసుకుందామని నమ్మించింది. అయితే కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఉన్నాయని అవి తిరితే గానీ తనకు పెళ్లి చేయరని చెప్పడంతో ఆమె అందాన్ని చూసి ఆశపడిన అతను కాబోయే భార్య కష్టాలు తనవేనని భావించి. ఆమె ఆర్థిక అవసరాల కోసం రూ.23 లక్షలు ఇచ్చాడు. డబ్బు అందిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనుమానం వచ్చిన బాలమురుగన్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. దానికామె నానా రకాల సాకులు చెబుతూ తప్పించుకోవడం మొదలెట్టడంతో యువతి తల్లిదండ్రులతో మాట్లాడి, పెళ్లి ఫిక్స్ చేసుకుందామని వెళ్లగా అక్కడ అతనికి కనిపించిన సీన్ చూసి దిమ్మతిరిగినంత పనైంది. యువతి ఉంటున్నట్టు పేర్కొన్న ఇంట్లో ఎవ్వరూ లేకపోగా అక్కడున్నది తనలాగే ఆమె చేత మోసపోయిన ఇంకో బాయ్‌ఫ్రెండ్ అని తేలింది. ఇక ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా చాలామంది యువకులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, అసభ్యంగా తీసుకున్న సెల్ఫీలు, ప్రేమ ముసుగులో అసభ్య చాటింగులు, ఎస్‌ఎంఎస్‌లు చూసి మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో పోలేసులకి ఫిర్యాదు చేశాడు మురుగన్ . పోలీసుల విచారణలో బాలమురుగన్ తరహాలోనే కోయంబత్తూరు, మదురై, చెన్నై, తిరుచ్చిరాపల్లి ప్రాంతాలకు చెందిన 17 మంది యువకులను మోసగించి రూ.85 లక్షల వరకు కాజేసినట్లు తేలింది.