పెళ్లాడనున్న ప్రముఖ జంట

పెళ్లాడనున్న ప్రముఖ జంట

దక్షిణాది భాషలన్నింటిలోనూ కథానాయకిగా నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచుకున్నారు త్రిష క్రిష్ణన్‌. ఆ తర్వాత కొన్ని చిత్రాలు వరుస ప్లాపులు అవ్వడంతో వెనకబడిన త్రిష మళ్లీ 96, పేట చిత్రాల విజయం ఆమెకు మళ్లీ క్రేజ్‌ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం త్రిష చేతి నిండా బోలేడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నటుడు శింబు, త్రిష కలిసి తమిళ చిత్రం ‘విన్నైతాండి వరువాయ’లో (తెలుగులో ఏమాయ చేశావే) నటించారు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం గతంతో సామాజిక మాద్యమాల్లో జోరుగా సాగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమని ఈ జంట స్పష్టం చేశారు.

అయితే ఇటీవల శింబు ఈ ఏడాది డిసెంబర్‌లో శుభవార్త చెబుతానంటూ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, తొందరలోనే పెళ్లి కబురు చెప్పనున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అది రియల్‌ లైఫ్‌ లేక రీల్‌ లైఫ్‌కు చెందిన విషయమా అని శింబు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ ఏడాది తమిళ నిర్మాత మండలి ఎన్నికల్లో శింబు తండ్రి టి. రాజేందర్‌ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో ఓ జర్నలిస్టు ‘మీ కుమారుడు శింబు.. త్రిషతో ఏడడుగులు వేయబోతున్నారా’ అని ప్రశ్నించారు. అయితే దీనికి అవును, కాదని ఏ సమాధానం చెప్పకుండా రాజేందర్‌ ఈ ప్రశ్నను దాటేశారు. దీంతో త్వరలో శింబు- త్రిష పెళ్లి పీటలు ఎక్కనున్నారని మరోసారి సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ వదంతులు కాస్తా నిజమే అయితే శింబు, త్రిష అభిమానులు పండగ చేసుకోనున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.