త్రివిక్రమ్ భయపడుతున్నాడా ? ( బర్త్ డే స్పెషల్ )

Trivikram scared to do direct new type of movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినీ రంగంలో త్రివిక్రమ్ ఓ బ్రాండ్. డైలాగ్స్ విషయంలో ఇండస్ట్రీ లో ఆయనకి ముందు ఆ తర్వాత అని చెప్పుకుంటారు. ఇక దర్శకుడిగా ఆయన ప్రయాణం ఓ సంచలనం. ఇలాంటి రొటీన్ పొగడ్తలు కురిపించడమంటే ప్రేక్షకులకి చూసిన సినిమా మళ్లీ చూపించడం లాంటిదే. త్రివిక్రమ్ స్టామినా గురించి ఇటు ఇండస్ట్రీ లో అటు ప్రేక్షకుల్లో ఏ సందేహాలు లేవు.ఆయన సినిమాకి ఏ అంచనాతో వెళ్లినా ఫుల్ మీల్స్ పెట్టి మరీ సంతృప్తిగా ఇంటికి పంపిస్తాడు. స్టార్ హీరోలు సైతం ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్న ఎన్టీఆర్ ఈ కాంబినేషన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు అన్నదానిపై ఇండస్ట్రీ లో కధలుకధలుగా చెప్పుకున్నారు. అన్నట్టు ఆ కాంబినేషన్ ఓకే అయ్యింది. ఎన్టీఆర్ తో ఇంకో ఫ్యామిలీ ఎమోషన్స్, చిన్నపాటి యాక్షన్ మిక్స్ చేసిన సినిమా చేయబోతున్నారట త్రివిక్రమ్. ఈ అనౌన్స్ మెంట్ చూసాక ఇండస్ట్రీ లో ఎందరెందరికో కెరీర్ గురించి సలహాలు ఇచ్చే త్రివిక్రమ్ తన కెరీర్ విషయంలో భయపడుతున్నాడేమో అనిపిస్తోంది.

త్రివిక్రమ్ ఇప్పుడున్న రేంజ్, ఆయనకి వున్న సక్సెస్ రేట్ చూసి ఆయన భయపడుతున్నాడన్న సందేహం వ్యక్తం చేస్తే నలుగురు నవ్విపోవడం ఖాయం. కానీ నిజంగా త్రివిక్రమ్ భయపడుతున్నాడు అనిపించడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. త్రివిక్రమ్ సినిమా కోసం మనం థియేటర్ లోకి వెళితే దర్శకుడిగా ఆయన మన ఇంటిదాకా వచ్చేసి దిగబెడతాడు. సినిమాలో ఆయన తీసిన సన్నివేశామో, రాసిన డైలాగో మనతో పాటు ఇంటిదాకా వచ్చి గుండె లోపలి కి వెళ్లి అలా కూర్చుండిపోతుంది. ఇందులో ఎవరికీ ఏ డౌట్స్ లేవు. కానీ ఆయన కెరీర్ లో ఇప్పటిదాకా దర్శకుడిగా చేసిన సినిమాల్లో నువ్వే నువ్వే, అ ఆ మినహా మిగిలిన సినిమాల్లో కామెడీ, సెంటి మెంట్, ఎమోషన్, యాక్షన్, హీరోయిజం ఇవన్నీ కొలబద్ద తో కొలత వేసినట్టు ఇమిడి ఉంటాయి.ప్రేక్షకుడి మదిని చదివిన ఓ మనస్తత్వ శాస్త్రవేత్త తీసినట్టు ఆయన సినిమాలు ఉంటాయి. కాస్త లోతుగా ఆలోచిస్తే ఒకప్పుడు సమంత అన్నట్టు త్రివిక్రమ్ బుర్ర పెట్టి తీసిన సినిమాలు ఇవన్నీ. బుర్ర పెట్టి తీస్తేనే ఇంతగా జనాన్ని రంజింప చేస్తే ఇక మనసుపెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రేక్షకులకి కావాల్సింది ఇచ్చే దర్శకులు చాలా మంది వున్నారు. అదే ఒరవడిలో త్రివిక్రమ్ శక్తులు కూడా పనిచేయడం చూస్తుంటే ఎక్కడో అసంతృప్తి .పది మందిని చదవగలిగినవాడు, వారిని నడిపించగలిగిన వాడు, వారికి మంచిచెడు నేర్పగలిగినవాడు వెనుక వచ్చే సమూహానికి దారి చూపగలగాలి. కాస్త ముందు నడవగలగాలి. అంటే సందేశాలు చెప్పమని కాదు …సక్సెస్ కోసం ఓ ఫార్ములాలో వెళుతూ అక్కడక్కడే ఆటాడవద్దని మాత్రమే చెబుతున్నాం.

ఓ మేధావి కనే కల లక్షల కోట్ల మెదళ్ళకి కదలిక. ఇక అలాంటి మేధావికి సమ్మోహన శక్తి మెండుగా వున్న పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తోడు అయినప్పుడు చెప్పే విషయం లో కొత్తదనం ఉంటే ఎంత బాగుంటుంది ?. సరికొత్త కలల్ని వెండితెరపై ఆవిష్కరిస్తే ఇంకెంత బాగుంటుంది?. అయినా ప్రేక్షకులు కోరుకునేది ఇస్తున్నా అని త్రివిక్రమ్ లాంటి దర్శకుడు కూడా అనుకుంటే కాస్త బాధగా అనిపిస్తోంది. ఈయన కూడా గెలుపు ఓటముల దగ్గరే కొట్టుమిట్టాడుతున్నాడు అనిపిస్తే ఎక్కడో కలుక్కుమంటోంది. అయినా ఎవరైనా అడిగింది ఇస్తే అప్పటికప్పుడు బాగుంటుంది కానీ నిజంగా అవసరమైంది ఇస్తే ఎప్పటికీ గుర్తుంటుంది. త్రివిక్రమ్ లాంటి ఆలోచనాపరుడు కొత్త దారులు వేయాలి కానీ సాఫీగా వున్న రహదారిలో నడవడం బాగా అనిపించడం లేదు. ఎన్టీఆర్ తో ఓ ఫ్యామిలీ ఎమోషన్ వున్న సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్ అనగానే ఈ నాలుగు మాటలు చెప్పాలి అనిపించింది. త్రివిక్రమ్ భయపడుతున్నాడు అని చెప్పడంలో తప్పు లేదు అనిపించింది. ఈ స్టేట్ మెంట్ తప్పని నిరూపించే శక్తి, సామర్ధ్యం త్రివిక్రమ్ కి వున్నాయనడంలో మాకు సందేహం లేదు. అలాంటి సందేహాలుంటే వదిలిపెట్టి కొత్తదారుల్లో నడక సాగించాల్సిన బాధ్యత మాత్రం త్రివిక్రమ్ దే.

 

కిరణ్ కుమార్ మొర్సా.