ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ల నుంచి సాధారణ నటీమణుల వరకు చాలా మంది ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సైతం ట్రోల్స్‌ను ఎదుర్కొన్నానని, అవి చూసి నిద్రలేని రాత్రలు గడిపానంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నటి ప్రియమణి కూడా చేరారు. ఇటీవల ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్’ సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న ప్రియమణి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలో తను ట్రోల్స్ బారిన పడినట్లు చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. నల్లగా ఆంటీలా ఉన్నావంటూ కొంతమంది ఘోరమైన కామెంట్స్ చేశారని తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘ఒకసారి నేను మేకప్ లేకుండా ఒక పోస్టు పెట్టాను. అది చూసి కొంతమంది నువ్వు మేకప్‌తోనే చూడటానికి బాగుంటావని, లేదంటే ఆంటీలా కనబడుతున్నావు అన్నారు. మరికొందరేమో నల్లగా ఉన్నానని, వయసైయిపోయింది అంటు కామెంట్స్ చేశారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆ ట్రోల్స్‌పై స్పందిస్తూ.. ‘నేను నల్లగా ఉంటే ఏంటి అది నాకు ప్రాబ్లం కాదు. మేకప్ నాకు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకుంటాను.
కేవలం షూటింగ్ కోసం మాత్రమే మేకప్ వాడతారు. మిగతా సమయంలో అసలు వాడను. ఎందుకు మేకప్ వేసుకోవాలి? ఇది నేను నాలా ఉంటాను అదే నాకు సౌక్యర్యం’ అంటూ ట్రోల్స్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అలాగే ‘లావు అయ్యానని, ఆంటీలా కనిపిస్తున్నాను అన్నారు. ఎవరికైనా వయసైపోతుంది. రేపు మీకు కూడా. నేను నమ్మేది ఒకటే వయసురిత్యా వచ్చే మార్పులను ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందే’ అంటూ ఆమె చురకలు అంటించారు. ఇక తన భర్త ముస్తఫా రాజ్ కూడా తనని ఎప్పుడు మేకప్ వేసుకోవాలని, మంచిగా కనిపించాలని, ప్లజంట్‌గా ఉండాలని చెబుతూంటాడని, కొన్ని సార్లు ఇది సరైనదే అనిపించిన మరికొన్ని సార్లు ఇతరుల కోసం మన వ్యక్తిత్వాన్ని ఎందుకు మార్చుకోవాలి అనుకుంటానని ఆమె చెప్పారు.