ఎల్బీ స్టేడియంలో ట్రోఫీలను చోరీచేసిన దొంగను సైఫాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అదనపు ఇన్‌స్పెక్టర్ (డీఐ) రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బెల్గాం జిల్లాకు చెందిన శివ సంజీవ షిండే (30) నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై గడుపుతుంటాడు. ఇటీవల ఎల్బీ స్టేడియంలోని ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయం తలుపులు నెట్టి అందులో ఉన్న పలు ట్రోఫీలను చోరీచేశాడు.
వాటిని మాంగార్ బస్తీలో తనకు తెలిసిన ఓ వృద్ధుడి ఇంట్లో ఉంచాడు. అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. చోరీకి గురైన వాటిలో వెండి ట్రోఫీతో పాటు ఇత్తడి ట్రోఫీలు 15 ఉన్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే అక్కడ తెలుపు రంగులో ఉన్నవేవీ దొంగిలించలేదని తేలింది. అతని వద్ద నుంచి ట్రోఫీలను స్వాధీనం చేసుకున్నారు.