వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలోగల సుల్తాన్పూర్లో ఈరోజు ఉదయం తెరాస నాయకుడు నారాయణరెడ్డి దారుణహత్య జరిగింది. ఈ రోజు ఉదయం తన పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డి పైన కొందరు గుర్తుతెలియని ఆగంతకులు రాళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. దీనితో సుల్తాన్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కాంగ్రెస్ నాయకుల చర్యగా భావించిన నారాయణరెడ్డి వర్గీయులు కాంగ్రెస్ నాయకుల పైన దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు.
గ్రామస్థుల సమాచారం ప్రకారం, నారాయణరెడ్డి అనుచరులలోని కొందరు యువకులు ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. ఈ విషయమై వారి మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయని, కుట్రలో భాగంగా ఆ యువకులే నారాయణరెడ్డి పైన రాళ్లదాడి చేసి, హతమార్చి ఉంటారని గ్రామస్థులు చెపుతున్నారు. నారాయణరెడ్డి పైన ఈ దాడి మంగళవారం ఉదయం 6.15 గంటలకు జరిగిందని సమాచారం. రాబోతున్న ఎన్నికల దృష్ట్యా, తెరాస నాయకుడి హత్య ఇక్కడ మరిన్ని ఉద్రిక్త పరిస్థితులను సృష్టించగలదని భావిస్తున్నారు.