ఆ పదవి అంటేనే వణికిపోతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…!

TRS MLAs Not Interest To Take Speaker

సెంటిమెంట్ అనేది అన్ని రంగాల్లో మామూలుగా ఉండేదే, కానీ ఈ మధ్య రాజకీయ రంగంలో అది సర్వ సాధారణంగా మారింది. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెంటిమెంట్స్ బాగా ఫాలో అవుతారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం, నామినేషన్స్ వేసేటప్పుడు ఇలా ప్రతిసారి ముహూర్తాలను చూసుకొనే రంగంలోకి దిగారు. దీంతో ఆయనే సెంటిమెంట్స్ ఫాలో అయితే మేము అవ్వకూదడా అనుకున్నారో ? ఏమో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వారు కూడా ఇప్పుడు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. తాజాగా స్పీకర్ పదవి విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాత సెంటిమెంట్ గుర్తుచేసుకొని ఆ కుర్చీలో కూర్చోవాలి అంటే వణికిపోతున్నారు. ఒకవైపు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అదృష్టవంతులెవరనే చర్చ జరుగుతుంటే మరోవైపు స్పీకర్ పదవి ఎవరికి దక్కతుందనే చర్చ కూడా మొదలైంది. స్పీకర్ పదవి అనేది ఎమ్మెల్యేలకు పెద్ద ప్రమోషన్, కాని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ పదవి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. మంత్రి పదవి లేకున్నా సరే కానీ స్పీకర్ సీట్లో మాత్రం కూర్చునేది లేదని తెగేసి చెబుతున్నారట. స్పీకర్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఆ తరవాతి ఎన్నికల్లో ఓడిపోతారనే సెంటిమెంటే దీనికి కారణం. ఉమ్మడి ఏపీలోని సెంటిమెంటే ప్రస్తుతం తెలంగాణలోనూ కొనసాగుతోంది. దాదాపు 20 ఏళ్లుగా అదే జరుగుతోంది.

1991లో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన శ్రీపాదరావు తరవాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తొలి మహిళా స్పీకర్‌గా 1999లో ఆ కుర్చీలో కూర్చున్న ప్రతిభాభారతి ఆ తరవాత ఎన్నికల్లో ఓడిపోయారు. నాటినుంచి ప్రతీ ఎన్నికల్లో ఓడిపోతూ ఒకదశలో తెరమరుగే అయ్యారు. ఇక 2004లో స్పీకర్‌గా పనిచేసిన సురేశ్‌రెడ్డి, 2009లో స్పీకర్‌గా పనిచేసిన నాదేండ్ల మనోహర్ కూడా మళ్లీ ఎమ్మెల్యేలు కాలేదు. తెలంగాణ ఏర్పడిన తరవాత మొదటి అసెంబ్లీకి మధుసూదనాచారి స్పీకర్‌గా వ్యవహరించారు. మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్. తాజా ఎన్నికల్లో భూపాలపల్లి బరిలో నిలిచిన ఆయన ఓడిపోయారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ చైర్లో కూర్చుంటే ఇక మళ్లీ గెలుపు కష్టమేననే భావన అందర్లోనూ బలపడింది. దీంతో స్పీకర్ పదవి కోసం తమ పేర్లు ఇలా వార్తల్లో వచ్చాయో లేదో టక్కున హైదరాబాద్‌లో వాలిపోతున్నారట సదరు నేతలు. ఏ పదవిలేకున్నా పర్లేదుగాని స్పీకర్ పదవి మాత్రం వద్దని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారట. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం స్పీకర్ గా ఎవరిని ఒప్పించి స్పీకర్ చైర్లో కూర్చోబెడుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.