ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత

ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు తెలిపారు. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపజాలదన్నారు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింప జేసి చర్చలకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో గొప్పగా పరిష్కరించిందని, 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆరెఎస్ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు.
ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తేల్చిచెప్పారు. అందుకు ఆయనను అభినందిస్తున్నా.. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజి క్యారేజీల విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలి. నేను 2018 అసెంబ్లీ ఎన్నికల టిఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నాను. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది మా ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదు. ఆర్టీసీయే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో పేర్కొన లేదని ఆయన చెప్పారు.