ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తొలిసారిగా ఆయన ట్రంప్‌పై నేరుగా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బైడెన్ కామెంట్స్ అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
ప్రజాస్వామ్యానికి డొనాల్డ్ ట్రంప్, ఆయన సహచరులు అతిపెద్ద ముప్పని బైడెన్ అన్నారు. ఆయన ఫోకస్ అంతా వ్యక్తిగత శక్తిని పెంచుకోవడంపైనే ఉందని.. దేశ ప్రధాన విలువలను బలోపేతం చేయడం గురించి ఆయనకు పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. ఇందుకు రిపబ్లికన్లు కూడా సహకరిస్తున్నారని.. వారి మౌనం దీనిని సూచిస్తోందని పేర్కొన్నారు.
బైడెన్ ఇప్పుడు అమెరికాకు ఏదో ప్రమాదం పొంచి ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని తుపాకీ గొట్టాలతో చంపలేరని, కేవలం ప్రజల మౌనం వల్లే అవి చనిపోతాయని అన్నారు. ప్రజలు భ్రమలకు, నిరాశకు, వివక్షకు గురైనప్పుడు వారికి అత్యంత ముఖ్యమైన దానిని వదులుకోవడానికి సిద్ధపడతారని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దాదాపు ఏడాదికిపైగా సమయం ఉన్నా.. ఈసారి పోటీలో పక్కాగా ట్రంప్ ఉంటారని బైడెన్ భావిస్తున్నారు. ఆయనపై ఎన్ని కేసులు, ఆరోపణలు ఉన్నా.. రిపబ్లికన్లు ట్రంప్‌కే మద్దతుగా ఉన్నారని బైడెన్ అనుకుంటున్నట్లు సమాచారం.