ఆసక్తికరంగా మారిన ట్రంప్-కిమ్ ల భేటీ !

Trump meets Kim-Jong un Singapore

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నిన్నటివరకు ఉప్పూ నిప్పుగా వున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, తొలిసారిగా కలుసుకున్నారు. సింగపూర్‌ లోని కేపెల్లా హోటల్‌ లో వీరు ఇరువురూ కలిశారు. ఆపై రెండు దేశాల మధ్యా శిఖరాగ్ర చర్చలు జరిగాయి. నిన్న మొన్నటి వరకూ వరుస అణ్వస్త్ర ప్రయోగాలు, అమెరికాపై అణు బాంబులు వేస్తామన్న బెదిరింపులతో కిమ్, ఉత్తర కొరియాను నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ తమ పట్టుదలలు వీడి, చర్చలకు ముందుకు రావడం, దానికన్నా ముందే తన దేశంలోని అణు పరీక్షా కేంద్రాన్ని కిమ్ మూసివేయడంతో చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది.

ఇక తొలుత ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపే ఇరు దేశాధినేతలూ, ఆపై అధికారుల సమక్షంలో చర్చలు సాగించారు. అయితే వీరి చర్చల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అవేంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొరియా భాష ఒక్క ముక్క కూడా రాదు. ఇక ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు తెలిసిన ఆంగ్ల భాష అతి తక్కువ. దీంతో ఇక ఒకరు మాట్లాడిన మాటలు మరొకరికి తెలిపేందుకు అనువాదకులు ఇరు దేశాలూ ముందుగానే ఏర్పాటు చేసుకున్నాయి. ఇక వీరిద్దరూ ఈ ఉదయం సింగపూర్ లో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తూ, తమ మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు. సుమారు గంటన్నర పాటు వీరిద్దరి మధ్యా చర్చలు సాగగా, అణ్వాయుధాలను వీడాలన్న డిమాండ్ పైనే ప్రధానంగా ట్రంప్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రపంచాన్ని భయపెడుతున్న ఓ పెద్ద సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో తామిరువురమూ కలిశామని, కిమ్ తో ఏకాంతంగా జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయనే నమ్ముతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు.