ఇండియాకి పెద్ద దేబ్బెసిన ట్రంప్ !

Trump Shock To India

అమెరికా అధ్యక్షుడు ఇండియాకు మరో షాకిచ్చారు. భారత ప్రయోజనాలకు భారీ విఘాతం కలిగించే మరో నిర్ణయం తీసుకున్నారు. ఏటా పన్నులు లేకుండా జరుగుతున్న 560 కోట్ల డాలర్ల భారత ఎగుమతులకు స్వస్తి పలకనున్నట్టు స్పష్టం చేశారు. జీఎస్‌పీ కింద భారత్‌కు ఇస్తున్న హోదా ఉపసంహరణ ప్రతిపాదనలను కాంగ్రెస్‌ సభ్యులకు పంపించారు. అయితే అమెరికా వినతిపై భారత్‌ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

భారత్‌ తో అమెరికా వర్తక లోటును తగ్గించే క్రమంలో ట్రంప్‌ ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్టు భావిస్తున్నారు ఆర్థిక నిపుణులు. సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ కింద అమెరికా మార్కెట్లో భారత్ కు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నప్పటికీ తమకు భారత్ అలాంటి సదుపాయాలు కల్పించడం లేదని అమెరికా అసహనం వ్యక్తం చేసింది. భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువులపై అధిక సుంకాలను విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయంతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్రాధాన్య వాణిజ్య హోదా ద్వారా అమెరికా మార్కెట్లోకి భారత్ ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఆ హోదాను తొలగిస్తే అన్ని వస్తువులపై సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది.