తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతో కలిసి పని చేయడం కష్టమని అన్నారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇద్దరు వేర్వేరు ముఖ్యమంత్రులతో పని చేస్తున్నానని తెలిపారు. రెండూ రాష్ట్రాల్లో విధులు చాలా భిన్నమైనవని అన్నారు.
ఇప్పుడు తాను వారితో కలిసి పని చేశానని ఇక ఇతర ముఖ్యమంత్రులతో కూడా పని చేయగలనని తనకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతృత్వంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఇది మంచిది కాదని గవర్నర్ తమిళిసై హితవు పలికారు. తనను మరో రాష్ట్రానికి మారుస్తారన్నది నిజం కాదని స్పష్టం చేశారు. తాను రబ్బర్ స్టాంప్ కాదని తెలిపారు. ఎవరు గవర్నర్‌గా ఉన్నా.. ప్రోటోకాల్ పాటించాల్సిందేనని తెలిపారు. రాజ్‌భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదని అన్నారు. ఏ విభేదాలు ఉన్నా, చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై తెలిపారు.