మనకు ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచ దేశాలు అండగా నిలవాలని దావోస్లో జరుగుతన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఆహార వ్యవస్థలు.. స్థానిక కార్యాచరణ(ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్)’ అనే అంశంపై ప్రసంగిస్తూ రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేది తమ ప్రభుత్వ స్వప్నమని తెలిపారు. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99 శాతం ఉండవని.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు.
‘‘నేను రైతు బిడ్డను.. వ్యవసాయం మా సంస్కృతి’’ అంటూ రేవంత్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారత్లో రైతు ఆత్మహత్యలు అతి పెద్ద సమస్య అని.. రైతులకు బ్యాంకు రుణాలు లభించవని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం వల్ల సరైన లాభాలు రావడం లేదని చెప్పారు.తెలంగాణలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలన్న లక్ష్యంతో.. ‘రైతు భరోసా’ పథకం ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు లాభాల బాట పట్టేందుకు ప్రపంచ దేశాలు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు.