విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ వాహనాలకు అవసరమైన అన్ని చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీఎస్ రెడ్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష జరిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్తు వాహనాలకు చార్జింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కరెంటు కొరత రాకుండా ఉండడానికి సౌర విద్యుత్తును పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాలపై సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.