సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. భాగ్యనగర వాసులంతా సొంతూళ్లకు పయనమయ్యేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు పండుగ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఏడాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రంగం సిద్ధం చేస్తున్నారు.
సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిర్వహించుకోవాలని భాగ్యనగర సీపీ శ్రీనివాస రెడ్డి కోరారు. పతంగులు ఎగురవేసే వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో లౌడ్‌స్పీకర్లు/ డీజేలు ఏర్పాటుచేయడం నేరమని హెచ్చరించారు.
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంంటి లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదని సీపీ సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14 ఉదయం 6 నుంచి 16వ తేదీన ఉదయం వరకు పోలీసుల ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పిల్లలు పతంగులు ఎగురవేసేందుకు పై అంతస్తులకు, రహదారుల పైకి, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్తుంటారని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీపీ పేర్కొన్నారు.