తెలంగాణ రాష్ట్ర సర్కార్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహణ వ్యవహారంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ రేసుకు సంబంధించి గతంలో చేసుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది.
అనుమతి లేకుండా ఈ-రేసు ఒప్పందం ఎందుకు చేసుకున్నారో తెలపాలని పొందింది. హెచ్ఎండీఏ నిధులు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించారో తెలపాలని ప్రశ్నించింది. వారం రోజుల్లో వీటిపై వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ కు రేవంత్ రెడ్డి సర్కార్ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా ఈ రేసు రద్దయిన విషయం తెలిసిందే. రేసు నిర్వహణకు సమయం సమీపిస్తున్నా మున్సిపల్ శాఖ నుంచి స్పందన లేకపోవటంతో వచ్చే నెలలో జరగాల్సిన ఈ-ప్రీ రౌండ్ రేసు నుంచి విరమించుకున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్(ఎఫ్ఐఏ) ప్రకటించింది. ఫార్ములా రేసును రద్దు చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తిరోగమన విధానాన్ని స్పష్టం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి ఎలక్ట్రిక్ వాహనాల ఫార్ములా రేసును నగరానికి తీసుకువచ్చిందని.. అందుకు అప్పట్లో తమ ప్రభుత్వం విశేష కృషి చేసిందని అన్నారు.