TS Politics: ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

TS Politics: Telangana government has taken a key decision regarding employees
TS Politics: Telangana government has taken a key decision regarding employees

తెలంగాణ ప్రభుత్వం సర్కార్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్ల రద్దు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో మినహా మిగిలిన రోజుల్లో డిప్యుటేషన్లకు అనుమతించరాదని సర్కార్ భావిస్తోంది. ఏ శాఖ అధికారులు ఆ శాఖలోనే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని యోచిస్తోంది.

ఇప్పటికేఅన్ని శాఖల్లోని డిప్యుటేషన్ల వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. రవాణా తదితర శాఖల్లో అదనపు విధులు-బాధ్యతల విధానాన్ని రద్దు చేసినట్లుగానే అన్ని శాఖల్లో డిప్యుటేషన్ల రద్దుపై ఈ నెలలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో వేయి మందికి పైగా అధికారులు అయిదేళ్లకు మించి డిప్యుటేషన్‌లో కొనసాగుతున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం అన్ని శాఖల్లో కలిపి 4 వేల మంది అధికారులు, 14 వేల మందికి పైగా ఉద్యోగులు డిప్యుటేషన్లపై ఉండగా.. అన్నింటికంటే ఎక్కువగా విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం.