ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. హుబ్బల్లి-నర్సాపూర్, విశాఖ-గుంటూరు, నంద్యాల-రేణిగుంట రైళ్లకు గుంటూరులో ఈరోజు మధ్యాహ్నం శ్రీకారం చుట్టనున్నారు. ఈ మూడు రైళ్లు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
విశాఖపట్నం-విజయవాడ మధ్య నడుస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును గుంటూరు వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వరకు నడుస్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్ నరసాపురం వరకు పొడిగించినట్లు చెప్పారు. నంద్యాల-కడప వరకు నడుస్తున్న ప్రత్యేక రైలును రేణిగుంట వరకు పొడిగించినట్లు వివరించారు. ఈ పొడిగింపు 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఉదయ డబుల్ డెక్కర్ పొడిగింపుతో గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి విశాఖపట్నానికి రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు.