TSPSC : త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ సర్కార్. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు పడనున్నాయి. చైర్మన్ తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. చైర్మన్ తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా చైర్మన్ తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల లీకేజీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో టీఎస్పీఎస్సీ తీవ్ర విమర్శల పాలైంది.
కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరడంతో కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు చైర్మన్ సభ్యులను నియమించనున్నట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో అమలు చేస్తున్న మెరుగైన విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే కేరళ పీఎస్సీని ఈ బృందం అధ్యయనం చేసింది.