హైదరాబాద్ నగరవాసులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నగరంలో ఆర్టీసీ బస్సుల్లో అన్‌లిమిటెడ్‌గా ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన T24 టిక్కెట్‌పై 20శాతం రాయితీ ప్రకటించింది. నగరంలోని ఎన్టీఆర్ మైదానంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో రూ.100 టిక్కెట్‌పై 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ఈ సదుపాయం ఈనెల 27 వరకు అమల్లో ఉంటుందని, ప్రయాణీకులు దీన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలో 24 గంటలపాటు చెల్లుబాటయ్యే రూ.100 ‘టీ24’ టిక్కెట్ కొనుగోలు చేసిన వారికే మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. T24 టిక్కెట్‌ను గతంలో మాదిరి కాకుండా ముందు రోజు ఏ సమయానికి ఈ టిక్కెట్ కొనుగోలు చేస్తే మరుసటి రోజు అదే సమయం వరకు వినియోగించుకోవచ్చని సూచించింది.
విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో పుస్తక ప్రియుల మనసులు దోచుకునేందుకు 34వ జాతీయ పుస్తక మహోత్సవం శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలు స్వయంగా తమ పుస్తకాలను విక్రయించేందుకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లో 1980వ దశాబ్దంలో పుస్తక ప్రదర్శన మొదలైంది. అధికార భాష ఉర్దూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడ భాషలకు చెందిన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్‌గా వెలుగొందుతోంది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ వంటి సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రదర్శనలో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి.