హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. హైదరాబాదీలకు సరికొత్త అనుభూతిని అందించేందుకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మూడు ఎలక్ట్రిక్ బస్సులు హుస్సేన్ సాగర్ చుట్టూ పరుగులు పెడుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంజీవయ్య పార్క్, థ్రిల్ సిటీ, లేక్ ఫ్రంట్ పార్క్, జలవిహార్, నీరాకేఫ్, పీపుల్స్ ప్లాజా, ఇందిరాగాంధీ, పివి విగ్రహం, అంబేద్కర్ 125 అడుగుల స్టాచ్యు ప్రాంతాల మీదుగా సెక్రటేరియట్ వరకు నడుస్తున్నాయి. ప్రయాణం ఉచితం.
ఇది ఇలా ఉండగా, కార్తిక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు భక్తుల కోసం ఓ స్పెషల్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. భక్తులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఎ.శ్రీధర్ సూచించారు. వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.