దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఫ్రీగా ప్రయాణించే గొప్ప అవకాశం టీఎస్ ఆర్టీసీ కల్పించిందని భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్టణం, కాకినాడ, భద్రాచలం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు, 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్‌లైన్ లేదా బుకింగ్ కేంద్రాల వద్ద రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చన్నారు.
ముందుగా బుక్ చేసుకున్న బస్సు బయలుదేరే టైం వరకు రెండు గంటల ముందు నగరంలో ఏ ప్రాంతం నుంచైనా బస్సు ఉన్న చోటుకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. నాన్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులు నాన్ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్‌ల్లోనూ, నాన్ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చే ప్రయాణికులకు కూడా వారు షెడ్యూల్డ్ టైం నుంచి 2 గంటలలోపు వారి గమ్యస్థానాలకు చేరుకునే వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. టీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.