విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తుంపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తొలి సినిమా ‘అష్టా చమ్మా’ మొదలు గత ఏడాదిలో విడుదలైన ‘వి’వరకు ప్రతి సినిమాలోనూ కొత్తదనం, కొత్త తరహా పాత్రలు పోషిస్తూ, తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేచురల్ స్టార్ నటించిన తాజా చిత్రం ‘టక్ జగదీష్’. తరచూ ప్రేమ కథా చిత్రాలతో అలరించే నాని.. తొలిసారి తెలుగింటి కుటుంబ కథను ఎంచుకున్నాడు.
నానికి ‘నిన్నుకోరి’ లాంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు వినాయకచవితి సందర్భంగా శుక్రవారం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. . టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ఈ ‘టక్ జగదీష్’ ఏ మేరకు అందుకున్నాడో రివ్యూలో చూద్దాం.
భూదేవిపురం గ్రామానికి చెందిన టక్ జగదీష్ అలియాస్ జగదీష్ నాయుడుకి కుటుంబం అంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య రాజేష్)అంటే జగదీష్‌కి ప్రాణం. తన తండ్రి ఆదిశేషు హఠాన్మరణం చెందడంతో ఇంటి బాధ్యలతను అన్నయ్య బోసు (జగపతి బాబు)కి అప్పగించి పై చదువుల కోసం పట్నానికి వెళ్తాడు జగదీష్. అయితే తనకు తెలియకుండా వేరే వ్యక్తితో మేనకోడలు పెళ్లి చేస్తారు కుటుంబ సభ్యులు.
విషయం తెలుసకోని జగదీష్ గ్రామానికి వస్తాడు. ఈ లోగా తన కుటుంబంలో సమస్యలు వచ్చి అందరూ విడిపోతారు. గ్రామ ప్రజలు కూడా జగదీష్ కుటుంబంపై ద్వేషం పెంచుకుంటారు. అసలు తన కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారు? అమితంగా ఇష్టపడే మేన కోడలు పెళ్లి జగదీష్‌కు తెలియకుండా ఎవరితో, ఎందుకు చేశారు? పదిమందికి ఆదర్శంగా ఉండే ఆదిశేషు కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి? దాన్ని జగదీష్ ఎలా పరిష్కరించాడు? ఇందులో రీతు వర్మ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. జగదీష్ నాయుడు అనే బరువైన పాత్రని అవలీలగా పోషించేశాడు. ముఖ్యంగా ఎమ్మార్వో జగదీష్ నాయుడిగా అదరగొట్టేశాడు. హీరో అన్నయ్య బోసు పాత్రలో జగపతి బాబు జీవించేశాడు. చాలా కాలం తర్వాత జగపతి బాబు అన్నయ్య పాత్రను పోషంచి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో తండ్రి ఆదిశేషు నాయుడిగా నాజర్ తనదైన నటనతో మెప్పించాడు. వీఆర్వో గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో రీతూవర్మ చక్కగా ఒదిగిపోయింది. హీరో మేనకోడలు చంద్ర పాత్రలో ఐశ్యర్య రాజేశ్ పర్వాలేదనిపించింది. అలాగే రావు రమేశ్, నరేశ్, మాలపార్వతి, రోహిని, దేవదర్శిని తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం కథతో తెరకెక్కిన చిత్రమే ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పుడు టక్ జగదీష్‌తో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రుచి చూపించాడు. కుటుంబం, ఆస్తి తగాదాలు, ఊర్లో భూ గొడవలు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే ఇలాంటి నేపథ్యం ఉన్న చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి.
టక్ జగదీష్‌లో కొత్తగా చూపించిదేమి లేదు. పైగా మేనకోడలు బాధ్యత, ఎమ్మార్వో ఉద్యోగం, హీరోకి ఓ ప్రేమ కథ.. అంటూ చాలా పెద్ద స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథను తెరపై చూపించడం కొంచెం కష్టమే. అయినప్పటికీ.. కథలోని ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేష్ ఇస్తూ చాలా క్లారిటీగా చేప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫ్యామిలీ ఒరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడనే చెప్పాలి. కానీ కమర్షియల్ కంటెంట్ లేకపోవడం సినిమాకు కాస్త మైనస్.
‘అయినోళ్లకంటే ఆస్తులు పొలాలు ఎక్కువకాదు..రక్త సంబంధం విలువ తెలుసుకో’, ‘మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు’ లాంటి డైలాగ్స్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విషయాకొస్తే.. తమన్ పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా.. గోపీసుందర్ నేపథ్య సంగీతం అదిరిపోయింది.
ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రావడం ప్లస్ పాయింటనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామాలు వచ్చి చాలా కాలమైంది. పైగా ఓటీటీలో సినిమా అందుబాటులో ఉండడం.. ‘టక్ జగదీష్’కి కలిసొస్తుందనే చెప్పాలి.