శ్రీరెడ్డి ఎపిసోడ్ తరువాత టీవీ 9 కి అంత కన్నా ఎక్కువ టీఆర్ఫీ వచ్చే కార్యక్రమం చేయడం పెద్ద సవాల్ గా మారింది. శ్రీరెడ్డి ఎపిసోడ్ తో రేటింగ్ ఎంత వచ్చిందో సమస్యలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. పవన్ కొన్నాళ్ళు తెల్లవారుతూనే టీవీ 9 మీద ఎలా విరుచుకుపడ్డారో చూసాం. అయితే ఈ గొడవ కాస్త సినిమా , న్యూస్ ఛానల్ మధ్య యుద్ధంగా మారిపోవడంతో సీన్ లోకి పెద్దల రాక , రాజీలు చకచకా జరిగిపోయాయి. ఇద్దరూ ఒకరి జోలికి ఒకరు రాకుండా అనధికార సెటిల్మెంట్ అయిపోయింది. అయితే టీవీ 9 కి అక్కడితో ఓ సమస్య అయిపోతే ఇంకో సమస్య మొదలైంది. నెగటివ్ స్టోరీలకు బాగా అలవాటుపడ్డ సదరు ఛానల్ కేవలం రాజకీయ చర్చలతో రేటింగ్ భారీ స్థాయిలో రాదని గ్రహించింది. అందుకేనేమో రాత్రి పూట పొలిటికల్ డిస్కషన్ టైం మార్చడంతో పాటు పగటిపూట చర్చల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా బిగ్ బాస్ మీద వరస కార్యక్రమాలు చేస్తోంది. దాంతో పాటు బతుకు జట్కా బండి , రచ్చ బండ లాంటి కార్యక్రమాలకు కూడా తెర లేపినట్టుంది.
నిన్న టీవీ 9 పగటి పూట రెండు లైవ్ డిస్కషన్స్ నడిపింది. అందులో రెండు కూడా భార్యాభర్తల మధ్య విభేదాలకు సంబంధించినవే. ఇందులో మొదటిది కృష్ణా జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ , ఆమె భర్త కి మధ్య గొడవ. భర్త పెద్ద విలన్ అయినట్టు టీవీ 9 హెడ్డింగ్ పెట్టినప్పటికీ చర్చ మొదలు అయ్యాక యాంకర్ సైతం వారి మధ్య సమస్య చిన్నదని చెప్తూ పదేపదే రాజీకి రావాలని సూచించారు. ఇందుకోసం మహిళా సంఘం నాయకురాలు సంధ్య , డాక్టర్ చక్రవర్తిని సైతం రంగంలోకి దించారు. ఇక సాయంత్రం డౌరీయిజం పేరుతో పెట్టిన చర్చ కూడా భార్యాభర్తల మధ్య గొడవే. పైగా ఈ రెండు చర్చలు ఒకే రోజు నిర్వహించడం, పైగా ఎక్కువ టైం కేటాయించడం చూస్తే టీవీ 9 కూడా జీ టీవీ లో వచ్చే బతుకు జట్కా బండి కార్యక్రమం నడిపినట్టు అనిపించింది.