రోడ్డు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. భార్య కన్నింగ్ ప్లాన్‌కు భర్త ప్రాణాలు బలి.

Twist in the road accident.. Husband's life is sacrificed to wife's conning plan.
Twist in the road accident.. Husband's life is sacrificed to wife's conning plan.

అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటనలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడని భావించగా.. కేసు విచారణలో హత్యగా తేలింది. భార్య ప్రియుడితో కలిసి హత్య చేసి రోడ్డు ప్రమాదంలో చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ కథ అడ్డం తిరగడంతో పోలీసులకు ఇద్దరు దొరికిపోయారు. నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన గుడివాడ అప్పలనాయుడు, జానకి భార్యాభర్తలు. ఈ క్రమంలో పాత కృష్ణదేవిపేటకు చెందిన తాపీమేస్త్రి చింతల రాముతో జానకికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరు రోజూ ఫోన్లో మాట్లాడుకోవడాన్ని భర్త గమనించి.. జానకిని పనికి వెళ్లడం మాన్పించాడు. ప్రియుడిని కలవకుండా భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది జానకి. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. భర్తకు మాయమాటలు చెప్పి ఈ నెల 20న కోటవురట్ల మండలం పాములవాకలోని పట్టాలమ్మతల్లి గుడికి తీసుకువెళ్లింది.

వీరిద్దరు తిరుగు ప్రయాణంలో తాండవ నది గట్టు దాటాక బహిర్భూమికి వెళ్లాలంటూ జనాకి బైకు ఆపించింది . రోడ్డుపక్కన జీడితోటలోకి అప్పలనాయుడ్ని తీసుకువెళ్లింది. కాసేపు కూర్చుందామని చెప్పి భర్త తలను ఒడిలో పెట్టుకుంది.. అప్పటికే అక్కడ మాటువేసిన రాము.. తనవెంట తెచ్చుకున్న సుత్తితో తలవెనుక బలంగా కొట్టాడు. అప్పలనాయుడు అక్కడికక్కడే కూలిపోగా.. ఇద్దరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారు.

ఘటనా స్థలం నుంచి రాము పారిపోగా.. జానకి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి, రోడ్డు ప్రమాదం జరిగిందని, అప్పలనాయుడు చనిపోయాడని చెప్పింది. కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం తరలించారు. అయితే అప్పలనాయుడు మృతిపై అనుమానాలు ఉన్నాయని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. జానకి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ కోణంలో దర్యాప్తు చేయగా.. ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు ఆమె ఒప్పుకోవడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పాపం భార్య తనతో ప్రేమగా ఉండటాన్ని భర్త గమనించలేకపోయాడు. వెనుక నుంచి ఆమె ప్రియుడు తనను హతమార్చుతాడని ఊహించలేకపోయాడు. ఈ ఘటనలో 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో పనిచేసిన పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అభినందించారు.